#🏏ఇంగ్లండ్ టీమ్🏴 #బెన్ స్టోక్స్
*బెన్‌స్టోక్స్ ఇదేనా 'స్పోర్టివ్ స్పిరిట్'.. నీ కవరింగ్ అంతా వేస్ట్❗*
28.07.2025🏏
ఓడిపోతుంటే తట్టుకోలేరు. ప్రత్యర్థి బ్యాటర్ సెంచరీ చేయడం చూసి ఓర్వలేరు. స్లెడ్జింగ్‌లో మాదే పైచేయి కావాలంటారు. అవతలి జట్టు ఏం మాట్లాడకూడదంటారు.
అలాచేస్తే వారి ఇగో వెంటనే హర్ట్ అయిపోతుంది. అప్పుడు, అక్కడి మీడియా ప్రత్యర్థి టీమ్‌పై పతాక శీర్షికల్లో గగ్గోలు పెడుతుంటాయి. ఈ ఉపోద్ఘాతమంతా ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ గురించే. 'మాంచెస్టర్'లో భారత్ దెబ్బకు ఆ జట్టుకు దిమ్మదిరిగిపోయింది.
మైదానంలో ఒకలా ప్రవర్తించి తమ జట్టుకు ఫలితం అనుకూలంగా తెచ్చేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రయత్నిస్తుంటారు. ప్రత్యర్థి జట్టుపై మాటల యుద్ధమే చేస్తారు. అది బూమరాంగ్ అయితే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో భిన్నంగా స్పందించి కవర్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులోనూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వాడిన పదాలు.. ఆ తర్వాత మాట్లాడిన మాటలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మ్యాచ్ సమయంలో 'బ్రూక్ బౌలింగ్‌లో సెంచరీ చేద్దాం అనుకుంటున్నావా' అని స్టోక్స్.. జడ్డూతో వెటకారంగా అన్నాడు. కానీ భారత బ్యాటర్లు ఆ మాటలేవీ పట్టించుకోలేదు. మ్యాచ్ ముగిశాక బెన్ స్టోక్స్ మాత్రం తమ బౌలర్ల కోసమే ఇలా చేశానంటూ కబుర్లు చెప్పుకొచ్చాడు.
భారత్ చాలా బాగా పోరాడింది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో ఎవరూ విజయం సాధించరనే ఉద్దేశంతో డ్రా కోసం ప్రతిపాదించాం. అప్పటికే మా ఫాస్ట్ బౌలర్లు గాయాలతో ఇబ్బందిపడ్డారు. డాసన్ కూడా చాలా ఓవర్లు వేశాడు. అతడి శరీరం అలసిపోయింది. దీంతో చివరి అర్ధగంట కోసం ప్రధాన బౌలర్ల విషయంలో రిస్క్ తీసుకోకూడదని భావించాం.
తన బౌలర్లను కాపాడుకోవాలనే ఉద్దేశం బాగానే ఉన్నా.. ప్రత్యర్థి బ్యాటర్ల ఆటను తక్కువ చేసేలా వ్యవహరించడమే ఇప్పుడు బెన్ స్టోక్స్‌పై ఉన్న 'రెస్పెక్ట్'ను తగ్గించింది. తన జట్టు కోసం ఐదు వికెట్ల ప్రదర్శన, సెంచరీ చేసిన స్టోక్స్ భారత ప్లేయర్ల విషయానికొచ్చేసరికి మాత్రం భిన్నంగా స్పందించడం గమనార్హం. బ్రూక్, డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేస్తారా? అంటూ వ్యంగ్యంగా అడగడమంటే జడ్డూ, సుందర్ ఇన్నింగ్స్‌ను తక్కువ చేయడమే కాకుండా.. అప్పటివరకు కష్టపడి బౌలింగ్ చేసిన వారి ప్రధాన పేసర్లనూ అవమానించడమేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇదే పరిస్థితుల్లో తమ జట్టు ప్లేయర్లు ఉండి.. అప్పుడు భారత్ డ్రా కోసం ప్రతిపాదిస్తే సానుకూలంగా స్పందిస్తారా? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నలూ సంధించారు.
బ్రూక్‌తో అలాంటి బౌలింగా?
అప్పటికే జడేజా, సుందర్ 90ల వద్ద ఉన్నారు. మ్యాచ్ చేజారిపోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పనిజెప్పారు. ఇక డ్రా కోసం ప్రతిపాదించే సమయంలో స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టారు. మనోళ్లు ఆటను ముగించరని భావించడంతో బ్రూక్‌ను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు కెప్టెన్ స్టోక్స్. సాధారణంగా బ్రూక్ కూడా మంచి బౌలింగే చేస్తాడు. ఓవైపు రూట్ మాత్రం కట్టుదిట్టంగా బంతులేస్తుంటే.. బ్రూక్ మరీ గల్లీ క్రికెట్లో పోరగాళ్లు ప్రవర్తించినట్లు వ్యవహరించాడు. 'కొట్టుకోండి. మీకు కావాల్సింది సెంచరీనే కదా' అన్నట్లుగా ఫుల్‌టాస్‌లు వేశాడు. ఫీల్డింగ్ సెటప్ కూడా అందరినీ బ్యాటర్‌కు దగ్గరగా తీసుకురావడం మరింత విమర్శలకు దారితీసింది. త్వరగా సెంచరీలు చేసేస్తే మేమంతా వెళ్లిపోతామన్నట్లుగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రవర్తించారు.
క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనా స్టోక్స్?
ప్రస్తుతతరంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా మారాడని క్రికెట్ వ్యాఖ్యాతలు, అభిమానులు ఓవైపు పొగుడుతుంటే.. బెన్ స్టోక్స్ మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం గమనార్హం. సిరాజ్ బౌలింగ్‌లో గాయపడిన తర్వాత సెంచరీ చేసిన అతడి ఆటను మాంచెస్టర్‌లోని భారత ప్రేక్షకులూ ఆస్వాదించి అభినందించారు. అతడు గాయంతో ఇబ్బంది పడుతూనే బౌలింగ్ చేసిన తీరూ ఆకట్టుకుంది. కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లతో హృదయపూర్వకంగా కరచాలనం చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. తన టీమ్ గొప్పగా ఆడినప్పుడు సంబరపడటం తప్పు లేదు.. కానీ, ప్రత్యర్థి జట్టు బాగా ఆడినప్పుడు అభినందించలేని కుసంస్కారం మాత్రం ఉండకూడదు. ఈ విషయంలో స్టోక్స్‌పై 'రెస్పెక్ట్' తగ్గిందంటూ నెట్టింట కామెంట్లు.