#🌷బుధవారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #🌺సుబ్రమణ్య షష్టి శుభాకాంక్షలు🙏 #సుబ్రమణ్య స్వామి షష్టి #సుబ్రమణ్య షష్టి శభాకాంక్షలు 🙏
శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఆలయాలు మన గోదావరి జిల్లాలో ఎన్నో ఉన్నాయి, వాటిలో కొన్ని ఎంతో వైభవాత్మక విశిష్ఠత కలిగిన ఆలయాలు మన చుట్టుప్రక్కల గ్రామాల్లోనే ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు?
ఇప్పడు నేను చెప్పబోయే ఆలయ విశిష్టత కూడా మన గోదావరి జిల్లాలో ఉన్నదే.. గుంపర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైనది, పదహారో శతాబ్దం నాటి ఆలయం. పూర్వం స్వామివారు సర్ప రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారని సర్ప రూపంలో స్వామివారిని చూసి భయభ్రాంతులు చెందటం వలన స్వామి శిలా రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిశారని ప్రతీతి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తులకి నమ్మకం. పూర్వ ఆచారం ప్రకారం అర్చకులు సూచనల మేరకు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించి అభిషేకము జరిపించుకుంటే సంతానము పొందుట విశేషము. వివాహము, ఆరోగ్యము మొదలగు కోరికలు నెరవేరునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతీ ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి నాడు స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవముగా జరుపుతారు. షష్ఠి నాడు విశేష అభిషేకములు, నాగులచీర భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. ప్రతీ నెలా శుద్ధ షష్టి నాడు మరియు ప్రతీ మంగళవారం స్వామివారికి విశేషంగా అభిషేకములు, పూజలు జరిపించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తూ భక్తులు తరిస్తారు.
పంచమి నాడు సర్ప వాహనంపై, షష్ఠి నాడు నెమలి వాహనంపై, సప్తమి నాడు రథంపై, అష్టమి నాడు పల్లకిపై స్వామివారిని ఊరేగిస్తూ గ్రామోత్సవం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు అంగరంగ వైభవంగా తీర్థం, మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు షష్ఠి తీర్థాన్ని వస్తారు.
ఈ ఆలయం యలమంచిలి మండలం, గుంపర్రు గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని చేరుకోవటానికి బస్సు మరియు ఆటో సౌకర్యం ఉంది. దూరప్రాంతం నుండి వచ్చేబక్తులకి పాలకొల్లులో రైల్వే స్టేషన్ కలదు. పాలకొల్లు కి పది కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది.
ఎన్నో విశిష్టత కలిగిన ఆలయాలు ఉన్న గ్రామంలో నేను పుట్టడం నా అదృష్టం. మా ఊరి విశేషాలు మీతో పంచుకోవటం నా ఆనందం. ఈ చరిత్ర చదివిన ప్రతీ ఒక్కరు మా ఊరు వచ్చి మా ఊరి ఆలయాలను సందర్శిస్తారని నా కోరిక. ఇట్లు మీ అడ్మిన్ శ్రీహరి.
#godarollamandi #godavari #subrahmanya #sashti