కమెడియన్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అస్రానీ గారు!
లేదా
తనదైన హాస్యంతో హాస్యానికే కొత్త సొగసులు అద్దిన అస్రానీ గారు!
దాదాపు 50 ఏళ్ళు వెండితెరపై నవ్వులు పూయించిన సుప్రసిద్ధ హాస్య నటుడు,నవ్వుల రారాజు,హాస్యానికే కొత్త భాష్యం చెప్పిన మేరుగరణదీరుడు,హాస్య సామ్రాట్ అస్రానీ గారు తన 84 ఏళ్ల మలి వయస్సులో దీపావళి రోజున ఓ తారజువ్వలా ఎగిసి తారల్లో కలిసిపోవడంతో ఒక మంచి ప్రతిభావంతమైన కమెడియన్ ను బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమ కోల్పోయినట్లయింది.గుడ్డీ, బావర్చీ,అభిమాన్,చోటీసీ బాత్,చుప్ కే చుప్ కే,ఇలా అనేక చిత్రాలలో అస్రానీ గారు పోషించిన పాత్రలు నభూతో న భవిష్యత్ అన్న తరహాలో కోట్లాదిమంది భారతదేశ సినిమా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి.అన్నింటికి మించి ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ మూవీ ' షోలే ' లో ఆయన చేసిన బ్రిటిష్ జమానేకే జైలర్ పాత్ర కోట్లాదిమంది సినిమా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే వుంది.అంతేకాదు అస్రానీ గారు కేవలం ఒక నటుడే కాదు,రచయిత,దర్శకుడు కూడా, గుజరాతీలో,హిందీలో ఆయన అరడజనుకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఈ స్టార్ కమెడియన్ అస్రానీ గారిది.ముఖ్యంగా ఎప్పుడు కూడా తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటూ,నటిస్తూ ముందుకు వెళ్లడమే కాదు,కాంట్రవర్సీలకు సైతం దూరంగా వుంటూ ఆయన చివరి శ్వాస వరకు కూడా నటించాలనే కోరుకొని,అలాగే తుది వీడ్కోలు సైతం తీసుకున్న అస్రానీ గారు ఎప్పటికి అశేష కోట్లాదిమంది భారతదేశ సినిమా ప్రేక్షకుల మనస్సుల్లో ఆయన చేసిన హాస్యం అనే విత్తనం మాత్రం చిరకాలం సజీవంగానే ఉంటుంది అనే మాట అక్షర సత్యం.ఇక అస్రానీ గారి వ్యక్తిత్వం విషయానికి వస్తే పెద్ద పెద్ద హీరోలకు స్నేహితుడిగా మసలిన అస్రానీ గారు కోట్లాదిమంది భారతదేశ సినిమా ప్రేక్షకులను వారి వారి నిత్య గొడవల నుంచి తప్పించేలా తనదైన హాస్యాన్ని బహుబాగా పండించిన ఓ మేటి అల్ టైం గ్రేట్ కమెడియన్ ఈ అస్రానీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏదిఏమైనా 1970లలో సీనియర్ కమెడియన్లు జానీ వాకర్,మహామూద్ లు మెల్ల మెల్లగా రిటైర్మెంట్ కు చేరువ అవుతున్న దశలో ఈ సువర్ణ అవకాశాన్ని తన రెండు చేతులతో అప్పనంగా అందిపుచ్చుకున్న ఈ అస్రానీ గారు ఎప్పుడు కూడా వెకిలి హాస్యం,స్టాఫ్ స్టిక్ కామెడీ చేయకుండా కేవలం తనకే సాధ్యమైన గొంతుతో,ఎక్స్ ప్రెషన్స్ తోనే ఓ నాణ్యమైన హాస్యం పండించి అందరిచే ఔరా,శేభాష్ అనిపించుకున్నాడు ఈ అస్రానీ గారు.అదేమాదిరి హృతికేశ్ సినిమాల్లో అస్రానీ గారి వేషాలు బాగా పండటమే కాదు ' అభిమాన్' సినిమాలో అమితాబ్ కు సెక్రటరీగా ఓ ఆత్మాభిమానం మెండుగా వున్న పాత్రలో బాగా ఒదిగిపోయిన అస్రానీ,చుప్కే చుప్కే చిత్రంలో ధర్మేంద్ర ఫ్రెండ్ గా సైతం అదేస్థాయిలో నటించి ఆ పాత్రలో సైతం చాలా గొప్పగా పరకాయ ప్రవేశం గావించాడు ఈ స్టార్ కమెడియన్ అస్రానీ గారు.ఏమైనా ఈ అస్రానీ ఒక్క బాలీవుడ్ చలన చిత్ర సీమకే పరిమితం కాకుండా మన తెలుగు సినిమా స్టార్ డైరెక్టర్లు దివంగత తాతినేని రామారావు గారు, దాసరి నారాయణరావు గారు,ప్రస్తుత సీనియర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వంటి ఉద్ధండులు అయిన దర్శకుల సినిమాల్లో సైతం నటించడమే కాదు,మహేష్ బాబు హీరోగా తొలి సినిమా ' రాజకుమారుడు లో బ్రహ్మానందంతో పాటు నటించాడు ఈ అస్రానీ గారు.ఇంకా చెప్పుకుంటూ పోతే ' సిరిసిరిమువ్వ' రీమేక్ ' ఏక్ దూజే కే లియే ' లో, ఊరికి మొనగాడు రీమేక్ ' హిమ్మత్ వాలా ' ఇలా చాలా సినిమాల్లో తన హాస్యాన్ని ఎంతో అపురూపంగా పండించాడు ఈ అస్రానీ గారు.అంతేకాదు దివంగత అల్లురామలింగయ్య గారికి బాగా అచ్చోచ్చిన చిత్రగుప్తుడి వేషాన్ని ' యమలీల రీమేక్ ' తక్ ధీర్ వాలా ' లో ఈ అస్రానీ గారు పోషించారు.ఇక యముడిగా ఆ చిత్రంలో ఖాదర్ ఖాన్ గారు నటించారు.అన్నింటికి మించి ప్రియదర్శన్ కామెడీలు మొదలు అయ్యాక అస్రానీ గారు మరొమారు తన సత్తా చాటుతూ ' అచ్చా హువా మై అంధా హు ' అని ఆయన చెప్పే డైలాగ్ మీమ్స్ లో ఇప్పటికి కనిపిస్తూనే ఉంటుంది.అమర్ రహే! అమర్ రహే తన మార్కు కామెడీతో కోట్లాదిమంది అశేష భారతదేశ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన స్టార్ కమెడియన్ అస్రానీ గారు!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#బాలీవుడ్