👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
610 views
ప్రతీ సంవత్సరం రిపబ్లిక్ డే కి ముందు అనౌన్స్ చేసే పద్మ అవార్డుల్లో బాగా ఇంట్రెస్టింగ్ గా స్ఫూర్తిదాయకంగా అనిపించిన అవార్డ్ గ్వాలియర్ కి చెందిన "మంగళ కపూర్" కి ఇచ్చిన పద్మశ్రీ. న్యూస్ లో, వెబ్సైట్ల లో మంగళ మేడమ్ గురించి రాసిన ఆర్టికల్స్ చూసి చాలా సంతోషం గా అనిపించింది . మనదేశం లో తొలిసారిగా ఆసిడ్ దాడి 12 ఏళ్ల వయసున్న మంగళ కపూర్ మీద జరిగింది.ఆరేళ్ల పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 37 సర్జరీలు చేయించుకుంది ఈవిడ బ్రతకడం కోసం. అంటే ఒక ఆడపిల్ల తన టీనేజ్ మొత్తం చదువు ,స్నేహితులు,సరదాలు,కుటుంబం తో కలిసి సంతోషపడే క్షణాలు ..ఇవేమీ లేకుండా కేవలం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బ్రతకడానికి కష్టపడింది. ఎంత దారుణం కదా ఇది. అయినా సరే పట్టుదలగా తను పోగొట్టుకున్నది అస్తమానం తలుచుకోకుండా, సంగీత సాధన చేస్తూ, అందులో సంతోషం వెతుక్కుంటూ శాస్త్రీయ సంగీతం లో డాక్టరేట్ తీసుకుని పాఠాలు కూడా చెప్తున్న ఈవిడ జీవితం నిజం గా పిల్లల పుస్తకాల్లో ఉండాలి. ఎందుకంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరి లో అవార్డ్ ఇచ్చారు . పుట్టడం,పోవడం మనచేతుల్లో లేదు అనుకుని మధ్య లో ఉండే సమయాన్ని ఎక్కువ భాగం ఊహించనంత నష్టాన్ని కళ్ళతో చూస్తూ ఆ బాధని అనుభవిస్తూ కూడా ఇంత సెలెక్టివ్ గా,పదిమంది మెచ్చుకునేలా తీర్చిదిద్దుకోవడం ఎంత కష్టం. శాస్త్రీయసంగీతం నేర్చుకోవడం మామూలు విషయం కాదే.కరెక్ట్ టీచర్ చేతిలో పడితే,వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయకపోతే గమకాలు ఒక స్ట్రీమ్ లైన్ లో పడతాయి లేదంటే మొత్తం సంగీతమే గందరగోళం అయిపోతుంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ప్రొఫెసర్ గా పనిచేస్తూ అనేకమందికి ఉచితం గా కూడా సంగీతం నేర్పారు ఈవిడ. ఒక్కోసారి జీవితం సంకెళ్ళు ,ముళ్ళ మధ్యలో ఉండిపోతే అవి దాటి మళ్ళీ బ్రతకడం కోసం పోరాటం చెయ్యాల్సి వస్తే ఇదిగో ఇలాంటివారి ప్రయాణం ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతే. సర్వైవర్ నుండి స్కాలర్ దాకా వెళ్ళిన మంగళ కపూర్ రోజూ అద్దం లో తన మొహం చూసుకుని నిజం గా బాధపడుతూ కూర్చుంటే ఇవన్నీ సాధించేవారా....జరిగిన నష్టం తలుచుకుంటూ కూర్చుంటే అసలు బ్రతికేవారా...భవిష్యత్ మీద నమ్మకంతో ,ఆశతో లేకపోతే ఇవాళ పద్మశ్రీ దాకా వెళ్ళేవారా..లేదు. మంచి మనసు,సాధించాలనే తపన ఉన్న హృదయం ,మంచి వ్యక్తిత్వం బాహ్య సౌందర్యాన్ని మించిన ఎవరెస్ట్ లాంటిది . వ్యక్తి శక్తి గా మారాలంటే సంకల్పం తో పాటు గట్టి పట్టుదల కావాలి అందుకు మంగళకపూర్ నిదర్శనం.. వీలైతే తెలుగు న్యూస్ చానల్స్,వెబ్సైట్లు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ లేటెస్ట్ న్యూస్ అందించేవారు ఇలాంటి వార్తలు అందించండి. ప్రపంచానికి ఒక విజేత నీ మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తే మంచిదే .. #తెలుసుకుందాం #worrior #inspirational people #inspirational people around the globe