#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*తప్పు చంద్రబాబుది కాదు, రాయలసీమదే❗*
JANUARY 10, 2026🎯
రాయలసీమ అంటే చంద్రబాబు కు ఏనాడూ ఒక లెక్క లో లేదు! సీమకు ఏం చేయకపోయినా వచ్చే సీట్లు ఎక్కడికీ పోవు, ఏం చేసినా రాని సీట్లు రావన్నట్టుగానే చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా వ్యవహరించారు! బీసీల జనాభా గణనీయంగా ఉన్న సీమలో గాలి వీచిందంటే తెలుగుదేశం స్వీప్ చేసుకుంటుంది! ఇంకేం కావాలి? అంత కన్నా! అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నీటి విషయంలో కూడా ఏం 22 టీఎంసీలు ఒక్క లెక్కనా? అని ప్రశ్నించగలుగుతున్నారు! అదేమంటే.. అన్నీ తానే, అంతా తానే అనే పాట అందు కుంటారు.
ఈ పాటికి హంద్రీనీవా ప్రాజెక్టు గనుక లేకపోతే.. రాయలసీమ నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించడం కూడా కష్టం! వైఎస్ఆర్ రెక్కల కష్టం హంద్రీనీవా. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపన రాళ్లు వేసి వదిలిపెడితే.. అవి దశాబ్దాల పాటు వెక్కిరించాయి. చివరకు రాజశేఖర రెడ్డి ఆ కలను సాకారం చేశారు. ఇప్పుడు హంద్రీనీవాను కూడా తన ఖాతాలో జమ వేసుకుని దబాయిస్తారు చంద్రబాబు!
రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ గ్రాంటెడ్ అనే భావనే కనిపిస్తుంది. అక్కడి ప్రజల అవసరాలు, నీటి కష్టాలు.. ఇవన్నీ ఆయన రాజకీయ లెక్కల్లో చివరి వరుసలో ఉంటాయి. ఇది మాటల విమర్శ కాదు, చరిత్ర చెప్పే సత్యం. అయినా ప్రతి ఎన్నికల్లో సీమ నుంచి ఆయనకు ఓట్లు పడతాయి, సీట్లు వస్తాయి. ఇదే ఆయన ధైర్యానికి మూలం. "ఏం చేసినా సీమ నా వెంటే ఉంటుంది" అన్న ధోరణి ఇక్కడే మొదలవుతుంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయానికి వస్తే ఈ నిర్లక్ష్యం మరింత స్పష్టంగా బయటపడుతుంది. 22 టీఎంసీల నీటిని సీమకు అందించాలన్న ప్రతిపాదనపై చంద్రబాబు తీరును చూస్తే ఇది దబాయింపేనని అర్థమవుతుంది. సీమకు నీరు అవసరం లేదన్నట్టు, లేదా ఆ అవసరం అంత అత్యవసరం కాదన్నట్టు మాట్లాడటం .. ఇది సీమ ప్రజలపై చేసిన అన్యాయం కాదా?
సీమ అనేది వర్షాభావ ప్రాంతం. వ్యవసాయం నీటిపైనే ఆధారపడుతుంది. ఒక టీఎంసీ నీటితో ఎంత భూమి పచ్చబడుతుందో రైతులకు తెలుసు. అలాంటప్పుడు 22 టీఎంసీలు “ఒక లెక్కనా?" అని ప్రశ్నించడం అంటే సీమ రైతు కన్నీళ్లను తక్కువగా చూడటమే. ఇది పాలకుడు మాట్లాడాల్సిన మాటేనా?
చంద్రబాబు పాలనలో సీమకు ఏం దక్కింది? హైదరాబాద్ను నిర్మించానని చెప్పుకునే నాయకుడు, సీమలో ఒక సమగ్ర అభివృద్ధి నమూనాను ఎందుకు చూపలేకపోయాడు? అభివృద్ధి కన్నా సామాజిక సమీకరణలే ఆయన్ను గెలిపిస్తాయన్న నమ్మకం ఆయనలో గట్టిగా ఉంది. అందుకే సీమ ప్రయోజనాలను పక్కన పెట్టి కూడా రాజకీయంగా ముందుకు సాగగలనన్న ధైర్యం. కానీ ఇది ఎంతకాలం? ప్రజలు ఎప్పటికైనా ప్రశ్నిస్తారు. నీరు, ఉపాధి, గౌరవం ఇవి కులాలకన్నా పెద్దవని తెలుసుకుంటారు.
ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రం, రాష్ట్రం, న్యాయస్థానాలు అన్నింటి మధ్య సమన్వయం అవసరం. కానీ చంద్రబాబు మాటల్లో సమన్వయం లేదు; ఉంది కేవలం రాజకీయ లెక్క. "ఇది సాధ్యం కాదు”, “అది అవసరం లేదు” అన్న మాటలు చెప్పడం సులువు. కానీ ఒక నాయకుడు చేయాల్సింది సీమకు ఎంత నీరు కావాలో, అది ఎలా తీసుకురావాలో స్పష్టమైన కార్యాచరణ చూపడం. ఆ ధైర్యం, ఆ నిజాయితీ ఇక్కడ కనిపించడంలేదు.
రాయలసీమ ప్రజలు దానం అడగడం లేదు. తమ హక్కును కోరుతున్నారు. తమ ప్రాంతం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురికాకూడదని కోరుతున్నారు. 22 టీఎంసీలు ఒక లెక్క కాదు. అవి సీమ జీవితానికి ప్రాణం. ఆ ప్రాణాన్ని లెక్కలతో కొలిచే నాయకత్వాన్ని సీమ ఇక ప్రశ్నించాలి. చంద్రబాబు సీమకు ఏమిచ్చారు? అనేది కాదు అసలు ప్రశ్న.. సీమ ఆయన నుంచి మొదటి నుంచి ఎందుకు తక్కువనే ఆశిస్తోంది? అనేదే!
*ఓ రాయలసీమ బిడ్డ*