P.Venkateswara Rao
528 views • 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖
*పెనం మీద నుంచి పొయ్యిలోకి❗*
NOVEMBER 18, 2025🎯
"తెల్ల కాగితం ఇస్తున్నా. ఎలాంటి పాలసీ తీసుకొస్తే మీకు లాభమే, ఏం కావాలో రాసుకోండి. మీరు కోరుకున్నట్టు చేస్తా” అని యువగళం పాదయాత్రలో ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ గ్రానైట్ వ్యాపారులతో అన్నమాటలివి. కూటమి ప్రచారాన్ని అన్ని వర్గాల ప్రజానీకం నమ్మినట్టే గ్రానైట్ వ్యాపారులు కూడా విశ్వసించారు. కూటమి వచ్చిన తర్వాత రాయల్టీ, జీఎస్టీ విషయాల్లో గ్రానైట్ వ్యాపారులకు ప్రయోజనం కలగడం పక్కనపెడితే, వైసీపీ
హయాంలో కంటే దారుణమని వ్యాపారులు వాపోతున్నారు.
ఉమ్మడి ప్రకాశం, కడప, కర్నూలు, కొద్దోగొప్పో అనంతపురం, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో గ్రానైట్, మైనింగ్ పరిశ్రమలు ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు గ్రానైట్ వ్యాపారులు వెళ్లి రాయల్టీ, జీఎస్టీ విషయంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ బాదుడు ఉన్న సంగతిని వివరించారు. అయితే ఈ దోపిడీ వెనుక ప్రభుత్వంలోని కీలక పెద్దలున్నారని, తామేమీ చేయలేమని చేతులెత్తేసినట్టు గ్రానైట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
వైసీపీ హయాంలో గ్రానైట్ పరిశ్రమల్లో ఒక్కో కట్టరు రూ.27 వేలు చొప్పున రాయల్టీ వసూలు చేసేవారు.
ఇప్పుడు కట్టర్కు రూ.35 వేలు, అలాగే అదనంగా జీఎస్టీ కింద రూ.5 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దుస్థితి.
అనధికారికంగా మరో రూ.35 వేలు చెల్లించుకోవాల్సి రావడంతో వ్యాపారం చేయలేమని వారు అంటున్నారు.
అంటే ఒక్కో కట్టర్కు రూ.75 వేలు ముట్టచెబితే తప్ప, వ్యాపారంలో ఏమీ చేయలేని పరిస్థితి వుందని వ్యాపారులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మైనింగ్లో అక్రమ, సక్రమ వసూళ్ల బాధ్యతల్ని నెల్లూరుకు చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. వైసీపీ హయాంలో ఈ కంపెనీ రెండు, మూడు జిల్లాలకే పరిమితమై వుండింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని గంపగుత్తగా అప్పగించినట్టు గ్రానైట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
ఈ కంపెనీ గ్రానైట్ వ్యాపారుల్ని జలగల్లా రక్తం పీల్చి పిప్పి చేస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. గ్రానైట్ వ్యాపారంలో ప్రభుత్వానికి 60 శాతం, కీలక నాయకులకు 40 శాతం ఆదాయం వెళుతున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ నుంచి అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నారనేది వారి ఆరోపణ. ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇష్టానుసారం చెకోపోస్టులు పెట్టడాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టులో ఇద్దరు ఉద్యోగులను నియమించుకుని, గ్రావెల్, ఇసుక, మట్టి తరలింపుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రానైట్ వ్యాపారులు పరిశ్రమల్ని మూసుకోడాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రాయల్టీలు భారమై, వ్యాపారాలు చేయలేకపోతున్నామని వాపోయేవారు. గతంలో నారా లోకేశ్ తియ్యటి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత భారం తగ్గించడానికి బదులు, మరింత మోపారని వారు ఆరోపిస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైందని గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
11 likes
13 shares