#మాయ దారి మత్తు
*బ్రాండ్ సేమ్.. బాటిల్ సేమ్.. లేబుల్ సేమ్.. రేట్ సేమ్. సరుకే..⁉️*
22.07.2025🍾
కిక్1, కిక్2 చూశారు.. ఇది కిక్‌త్రీ స్టోరీ. మంబుబాబులకు ఎక్కిన కిక్కును వదలగొట్టే నకిలీ లిక్కర్ కహానీ. బాటిల్ మీద లేబుల్ చూసి ఖరీదైన బ్రాండ్ అనుకుని వేలు పోసి కొనుక్కుంటారు.
తనివితీరా సేవిస్తారు. కానీ.. ఏదిరా మనకెక్కాల్సిన కిక్కు అని బేజారైపోతున్నారా? అలా ఐతే మీరు తీసుకున్నది బ్రాండెడ్ బాటిల్ కాదు. బ్రాండెడ్ ముసుగులో మీకు అంటగట్టిన నకిలీ సరుకు. ఎస్… ఫేమస్ బ్రాండ్లను కూడా చీప్ లిక్కర్ కంటే చీప్‌గా మార్చేసి.. డ్రింకర్లను బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు.
తాగితే పోతావ్ అని లిక్కర్ బాటిల్ మీద రాస్తారు. కానీ.. ఇది తాగితే తొందరగానే పోతావ్ అని హెచ్చరిస్తోంది అబ్కారీ శాఖ. కిక్కు తగ్గడమే కాదు.. తాగినవాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసే భయంకరమైన దందా ఒకటి బయటకు వచ్చింది. మందుబాబుల గుండెలు పగిలే బ్రేకింగ్ వార్త ఇది. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మద్యం తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా తెలుగు రాష్ట్రాల్లో తాజా సంచలనం. . హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో కేటుగాళ్లను పట్టుకుని కూపీ లాగుతున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోడౌన్‌పై ఏపీ ఎక్సైజ్ పోలీసులు చేసిన దాడులతో బైటపడింది ఈ నకిలీ సరుకు దందాగిరీ. కోదాడలో కూడా మరో ముఠా పనిచేస్తున్నట్టు తెలీడంతో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల్ని అలర్ట్ చేశారు.
ఒరిజినల్ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్, కొంత మద్యం కలిపి.. సీల్ వేసి అచ్చం బ్రాండెడ్ బాటిల్స్‌లాగా మార్కెట్లోకి వదులుతున్నాయి మద్యం ముఠాలు. హైదరాబాద్‌లోని కృష్ణ ఫార్మా అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నులకొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి, ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని ఒక రైస్‌మిల్లులో కల్తీ విస్కీ తయారు చేస్తారు. ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేశాయి ముఠాలు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను తయారు చేసుకుని.. ఒరిజినల్ బ్రాండ్‌కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ సరుకును మార్కెట్లో పెట్టేశారు. గతంలో ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురంలో ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ తీగలాగితే సూర్యాపేట.. ఆ తర్వాత హైదరాబాద్లో ఈ డొంక కదిలింది.
సూర్యాపేట జిల్లా కల్తీ విస్కీ తయారీ కేసులో ఊహించని ట్విస్ట్ ఇంకోటుంది. త్వరలో రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ విధంగా పెద్దఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఓటుకు బాటిల్ పథకంలో భాగంగా ఖరీదైన బ్రాండెడ్ బాటిళ్లు ఆశచూపి ఓటర్లను ఫిదా చేయాలన్నది వీళ్ల స్కెచ్చు. ఐదుగురిపై కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శివశంకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఎక్సైజ్ దాడుల్లో 20 లక్షల రూపాయల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనమైంది.
తాగేవాడికే కాదు.. అమ్మేవాడిక్కూడా తెలీదు. అంత పక్కాగా ఉంటుంది వీళ్ల స్టయిలాఫ్ మాన్యుఫ్యాక్చరింగ్. డిపార్ట్‌మెంట్ అధికారులు తదేకంగా పరిశీలిస్తే తప్ప అది నకిలీ సరుకు అని తెలుసుకోలేరు. ఆ రేంజ్‌లో రాటుదేలిపోయారు నకిలీ సరుకు తయారీగాళ్లు.
సో.. బార్డర్లో బద్దలైన మందు దందాతో… రెండు రాష్ట్రాల్లో మందుబాబులకు పెద్ద ప్రమాదమే తప్పినట్టుంది. కానీ.. దొరికింది వీళ్లు. దొరకని ముఠాలు ఎన్నో. వాళ్లందరి ఆట కడితే తప్ప నకిలీ బ్రాండెడ్ మందుకు ఫుల్‌స్టాప్ పడ్డట్టు కాదు.