🌺 శ్రీమాతా మహాదేవి రూప వైభవం 👏🏼
‘
’దేవతాల ఎదుట ఒక మహాతేజస్సు ఉద్భవించింది .నాలుగు వైపులా వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి .కోటి సూర్య ప్రకాశం తో ,కోటి చంద్ర ప్రకాశంతో చల్లదనం విరాజిల్లు తోంది .కోటిమేరుపులు ఒక్క సారిగా మెరిసినట్లు అరుణకా౦తులను వెదజల్లుతోంది .పైనకాని మధ్యకానీ .ప్రక్కలకానీ పల్చ బారలేదు .ఆద్యంతాలు లేవు .కరచరణాది అవయవాలు లేవు .స్త్రీపు,రుష ,ఉభయ రూపమూ కాదు .ఆదీప్తికి దేవతల కళ్ళు బసకబారి ,ధైర్యం తెచ్చుకొని విప్పార చూశారు .అప్పటికి ఆ దివ్యతేజస్సు స్త్రీరూపం దాల్చింది .రాశీభూత సౌందర్యం .కుమారి .నవయవ్వన .తామరమొగ్గలలాంటి పీన కుచద్వయం .చిరుమువ్వలు సవ్వడి చేస్తున్న మేఖల మంజీరాలు .బంగారు కేయూరాలు ,అ౦గడాలు .క౦ఠాభరణాలు.రత్నరాశులు పొదిగిన కంఠ పట్టిక . చిన్న మొగలిరేకుని ముడుచుకొన్న కొప్పు .విశాల కటిప్రదేశం .సన్నని నూగారు .కర్పూర తా౦బూలంతో ఎరుపెక్కి,సువాసనలు వెదజల్లుతున్న నోరు .మెరిసిపోతున్న బంగారు లోలకులతో తళుకులీనుతున్ననున్నని చెక్కిళ్ళు . . అష్టమి చంద్రరేఖ లాంటి నుదురు .దట్టమైన కనుబొమలు .ఎర్రకలువల్లాంటి నేత్రాలు .కొనదీరిన ఎత్తైన ముక్కు ..మధురాధరం .మల్లెమొగ్గల్లాంటి పలువరుస .ముత్యాల దండలు .రత్నకిరీటం ..చెవికి అందమైన ఇంద్రరేఖ .జడలో మల్లికా మారుతి పుష్పహారం ..నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమబొట్టు .పాశాంకుశ వరద అభయ హస్తాలు .ఎర్రని చీరతో ,దానిమ్మపూవు రంగుతో ధగధగలాడుతున్న జగన్మాత .సర్వ శృంగార వేషాఢ్య .సర్వ దేవ నమస్కృత .సర్వాశా పూరిక .సర్వమాత.సర్వమోహిని .ప్రసన్నంగా చిరునవ్వు చి౦దీస్తోందిఆ అవ్యాజ కరుణా మూర్తి .
మాహిషాసుర మర్దిని
బ్రహ్మ దేవుడి వదనం నుంచిఒక తేజోరాశి ఉదయించింది .అది దుస్సహంగా వెలిగిపోతూ పద్మరాగ మణి ప్రభలు వెదజల్లుతోంది .సమశీతోష్ణకాంతులు ప్రసరిస్తోంది .హరిహరులే ఆశ్చర్యపోయారు .శివుడి శరీరం నుంచి మరోతేజోరూపం ఆవిర్భవించి వెండిలా ధగధగ లాడింది .కళ్ళు మిరుమిట్లు గొల్పే భీకరంగా ఉంది .పర్వతం లా ఉంది .తమోగుణం రూపుదాల్చినట్లుంది వేడిగా ఉంది .ఆవెంటనే విష్ణుమూర్తి నుంచి నీలిరంగులో మూర్తీభవించిన సత్వ గుణం లా తెల్లని చల్లని తేజస్సు వెలువడింది .ఇంద్రుని శరీరం నుంచి విచిత్ర వర్ణం లో సర్వ గుణాత్మకమైన తేజో రాశి ఉద్భవించింది .యమ అగ్ని, కుబేర, వరుణ దేవతలనుంచి తేజస్సులు వెలువడ్డాయి ..సకల దేవతల తేజస్సులూ విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తికట్టి హిమాలయ౦గా దర్శనమిచ్చింది.అంతా ఆశ్చర్యపడుతుండగా ఆ తేజోరాశి ఒక స్త్రీ మూర్తిగా పరిణమించింది .సౌందర్యరాశి .త్రిగుణా౦బిక .సర్వ దేవ సముద్భూత .అష్టాదశ భుజ .త్రివర్ణ .విశ్వమోహిని .తెల్లనిముఖం నల్లని కనులు .ఎర్రని పెదవులు .చిగురాకులవంటి అరచేతులు .శరీరమంతా దివ్యాభరణాలు .పద్ధే నిమిది బాహువులు క్షణం లోవెయ్యి బాహువులయ్యాయి .ఇప్పుడు సహస్రభుజ .మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజశ్విని .
‘’శ్వేతాననా కృష్ణ నేత్రా సంరక్తాధరపల్లవా -తామ్రపాణి తలా కాంతా దివ్యభూషణ భూషితా -అష్టాదశ భుజా దేవీ సహస్ర భుజ మండితా-సంభూతాసుర నాశాయ తేజోరాశి సముద్భవా ‘’
శంకరుడి తేజస్సు ఆ దెవి ముఖ పద్మమయింది .అదిశ్వేత వర్ణం . శుభాకారం .యముడి తేజస్సు ఆమెకు నల్లని పొడవైన కురులయ్యాయి .మేఘవర్ణ౦ తో వంకీల మనోహరమైన జుట్టు .అగ్ని దేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలతో మూడు కనులయ్యాయి .ప్రాతస్సాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమలయ్యాయి .మన్మధుని ధనుస్సులా మెరిసే భ్రూలతం ..వాయుదేవుడి తేజస్సు చెవులు .అవి మన్మధుని డోలికల్లామనోహరంగా ఉన్నాయి .కుబేరుడి తేజస్సు ఆ దేవికి నాశిక అయింది .నువ్వు పువ్వులా నున్నగా నిగనిగ లాడుతోంది .ప్రాజాపత్య తేజస్సుతో ఆతల్లికి దంతాలు ఏర్పడ్డాయి .కోణాలు తేలి దగ్గరదగ్గరగా పేర్చిన మల్లెమొగ్గల్లా ప్రకాశిస్తున్నాయి . అరుణతేజస్సుతో దొండపండు వంటిక్రింది పెదవి .కార్తికేయుడి తేజస్సుతో పైపెదవి ఏర్పడింది .
ఆ మహాదేవికి విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి .వసువుల తేజస్సుతో చేతులకు వ్రేళ్ళు ఏర్పడ్డాయి .అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకం గా భాసిన్నాయి . చంద్రుని తేజస్సు అమ్మవారికి వక్షద్వయం అయింది .ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగ౦ ఏర్పడింది .త్రివళులు గంభీర మనోహం గా ఉన్నాయి .వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి .పృధ్వీ తేజస్సుతో విశాల జఘనం ఏర్పడింది ఈ రకంగా శుభాకార ,సురూప సుస్వర స్త్రీ మూర్తి ఆవిర్భవించింది.అ సుదతిని ,చారులోచనను ఆ సర్వాంగ సౌష్టవ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడి మహిషాసుర పీడఇక వదిలి పోతుందని సంతోషించారు .
విష్ణుమూర్తి దేవతలందర్నీ తమతమ దివ్యాయుధాలను మహాదేవికి సమర్పించమని ఆదేశించాడు .శిరసావహించిన దేవతలు సమర్పించారు . క్షీర సముద్రుడు ఎర్రని సన్నని వినూత్న వస్త్రాలను ఆ మహా లక్ష్మికి సమర్పించాడు .వినిర్మల హారం బహూకరించాడు .సూర్యకోటి సమప్రభ చూడామణి ,రత్నమయ కుండలాలు కడియాలు తనకూతురికి కానుకలుగా అందించాడు.విశ్వకర్మ ప్రసన్న చిత్తం తో నానారత్న విభూషిత కేయూర కంకణాలు సమర్పించాడు .త్వష్ట సుస్వర సుమధుర ధ్వని చేసే ఆకర్షణీయ నూపురాలను సృష్టించి ఇచ్చాడు .అవి సూర్య మండలాల్లా ప్రకాశిస్తున్నాయి .మహాసముద్రుడు కంఠాభరణాన్ని ,ఉంగరాలను కానుక పెట్టాడు .వరుణుడు ఎప్పటికీ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతీ మాలను ఉపద(కానుక )గా సమర్పించాడు .హిమవంతుడు వివిధరత్నాలతోబంగారు కాతులీనుతున్నసింహాసనాన్ని వాహనం గా సమర్పించాడు .సర్వాలంకార సుశోభిత అయిన ఆదేవి ఆ సింహాసనాన్ని ఠీవిగా అధిరోహించింది .
శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి శ్రీదేవికి కానుక ఇవ్వగా అది వెయ్యి అంచులతో ఒకే సారి వెయ్యిమంది రాక్షసుల్ని సంహరించేట్లు ఉన్నది .శంకరుడు తన త్రిశూలం నుంచి మరో త్రిశూలం సృష్టించి ఇచ్చాడు అది దేవతలకు అభయ హస్తంలా భాసించింది .వరుణుడు వెన్నముద్ద లాంటి శంఖం ఇవ్వగా అది శుభప్రదంగా ,జయప్రదంగా కనిపించింది .అగ్ని దేవుడు శతఘ్ని సృష్టించి ఇచ్చాడు వాయుదేవుడు దివ్య ధనుస్సు,ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబులపొది ఇచ్చాడు .దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు . దివ్యఘంటలున్న తన ఐరావతాన్ని సమర్పించాడు .యముడు తన కాలదండం లాంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు .బ్రహ్మ దేవుడు గంగాజలం తో నిండిన దివ్య కమండల౦ అందించాడు .వరుణుడు తన పాశాయుదాన్ని ,కాలుడు ఖడ్గాన్ని ,విశ్వకర్మ గండ్ర గొడ్డలిని సృష్టించి ఇచ్చారు .కుబేరుడు సురనిండిన సువర్ణ భాండం సమర్పించాడు.చిరుగంటలు పొదిగిన కౌమోదకి గదను త్వష్ట సృష్టించి ఇచ్చాడు .అనేక దివ్యాస్త్రాలు ,అభేద్య కవచం కూడా అందించాడు .సూర్యుడు తన తేజస్సును అమ్మవారికి బహుమానంగా సమర్పించాడు .ఈ సకలాయుధ దివ్య అస్త్రశస్త్ర సమేత శ్రీ దేవిని చూసి ఆమె చేతిలో మహిషుడి చావు నిశ్చయమని సంతోషంతో స్తుతించారు .
‘’నమః శివాయై కల్యాణ్యైః శాంత్యై పుష్ట్యై నమోనమః -భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః
కాలరాత్ర్యై తథాంబాయా ఇంద్రాణ్యై తేనమోనమః -సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమొనమః
పృధివ్యాం యా స్థితా పృధ్వ్యా న జ్ఞాతా పృదివీం చయా-అంతస్తితా యమయంతి వందే తామీశ్వరీం పరా౦
మాయాయాం యా స్తితాజ్ఞాతా మాయయా నచ తామజాం -అంతః స్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం’’
భావం -సిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతి ప్రదమైన ఇంద్రానికి కల్యాణికి ,వైష్ణవికి నమస్కారం .కాళరాత్రి భగవతికి వందనం . భూమికి తెలియకుండా భూమిని తెలుసుకోకుండా భూమిపైనే ఉంటూ ,అంతరాంతరాలలో విరాజిల్లుతూ ,సకల ప్రాణికోటినీ నియంత్రించే జగదీశ్వరికి ప్రణామం .మాయ కారణంగా అవిజ్ఞేయ అయిన మాయారూపిణికి నమస్సులు .అంతశ్శక్తిగా అందర్నీ నడిపించే ప్రేరయిత్రికి దండప్రణామాలు .
దేవతల స్తోత్రాలు శ్రీదేవికి సంతృప్తికలిగించాయి .మహిషాసురుడిని ఇప్పుడే సంహరిస్తాను ఆని అభయ మిచ్చింది .ఈ సృష్టిలో ఇదొక విచిత్రం .దైవబలం ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంది సుఖడుఖాలకు కాలమే కర్త .చిరునవ్వు వికటాట్ట హాసంగా మారి మహిషాసుర సంహారం చేసి సకల లోకాలకు శాంతిని ప్రసాదించింది జగజ్జనని .
🔱⚜️🙏🍀🌺🧿
#అమ్మలకన్న అమ్మ ఆది పరాశక్తి #🙏🙏ఓం శక్తి 🙏🙏 #శ్రీ శక్తి ఓం🙏🏽🙏🏽🙏🏽🙏🙏 #🙏హ్యాపీ మహానవమి🌼 #🙏హ్యాపీ నవరాత్రి🌸