#పశువులు పండుగా #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కనుమ/ముక్కనుమ/పశువుల పండుగ 🐄🐮🐃🦬
🔔 *విశేషం* 🔔
*బసవడికి కోటి దండాలు*
నేటి కనుమ పండుగ ప్రత్యేకం
పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేకపూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే జీవులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ.
సంక్రాంతి వ్యవసాయ పండుగ! శ్రమైక జీవన సౌందర్యానికిది ప్రతీక! ఆరుగాలం శ్రమపడ్డ రైతుకు పంట ఇంటికి చేరితే నిజంగా పండుగ! సకల శుభదాయకంగా సమస్త శ్రేయస్కరంగా భావించి, ప్రాంతాలతో నిమిత్తలేకుండా పల్లె ప్రజానీకమంతా హర్షాతిరేకాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి.
ప్రకృతి మాపై కరుణ చూపాలి. సూర్యునితో సహా నవగ్రహాల దయ మాపై ఉండాలి. మబ్బులు రావాలి, ఉరుములు మెరవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, పంటలు పండాలి, గాదెలు నిండాలి, కడుపునిండా తిండి దొరకాలి, సమస్తం క్షేమంగా ఉండాలి. సకల వృద్ధి పొందాలి, అంతటా సంతోషం వెల్లివిరియాలనే భావనే సంక్రాంతి నేపథ్యంగా ఉంటుంది.```
*పశువుల పండుగ*```
భోగి, మకర సంక్రాంతి తరువాతి రోజు కనుమ పండుగ. వ్యవహారంలో కనుమ పండుగగా స్థిరపడినప్పటికీ దీని అసలు పేరు 'కనుము పులు' పండుగ. కనుము అంటే పశువు అని అర్ధం. పులు అనే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యం, అల్పమైనది, కసవు అర్ధాలున్నాయి. కసవు అంటే గడ్డి. కనుమ పండుగనాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఈ పండుగకు 'కనుము పులు' పర్వం అని పిలిచారు.
కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు చెల్లించుకునే పర్వంగా కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంప్రదాయం.
పరోపకారమే ధ్యేయంగా గల మూగజీవులను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సంప్రదాయం కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా భావించి, అనంతకోటి ప్రాణిపట్ల దయార్ద్ర హృదయాన్ని కలిగి ఉండాలనే భావనతో కనుమ రోజున విశిష్టంగా రైతన్నలు జరుపుకునే పండుగ ఇది. సిరిసంపదలిచ్చే గోమాతను, బవసన్నను పూజించే పండుగ. మూగజీవాల పట్ల ప్రేమను తెల్పుతూ కనుమనాడు రైతులు పశుశాలను శుభ్రపరచి పశువులను శుభ్రంగా కడుగుతారు. పశువులకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెడతారు. మెడలో గంటలు, గవ్వలు కడతారు. కొమ్ములకు వెండి తొడుగులు, కాళ్లకు గజ్జలు తొడుగుతారు. పూల మాలలు వేసి పూజిస్తారు. ఆ తర్వాత పశువులన్నింటికీ పచ్చగడ్డి, సెనగపిండి పొంగళ్లను దాణాగా తినిపిస్తారు♪. ఆ సాయంత్రం రైతులు, వ్యవసాయదారులు పశువులను మేళతాళాలతో ఊరంతా తిప్పుతారు. కనుమ నాడు గోవును పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలం పొందుతారని శాస్త్రోక్తి. సంతానానికి గోవు సంకేతం. ధర్మానికి ఎద్దు సంకేతంగా భావిస్తారు.```
*పొలి చల్లడం*```
కష్టించి పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి వచ్చిన సమయంలో రైతులు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. కొత్త ధాన్యంలో ఆవుపాలు, చక్కెర కలిపి పొంగలి తయారు చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించి, కుటుంబంలోని అందరూ స్వీకరిస్తారు. పొంగలి మెతుకులు పొలమంతా చల్లుతారు. అందువల్ల పంట పొల్లుపోక, గింజ రాలుబడి హెచ్చుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. ఈ ఆచారానికే పొలిచల్లడం అని పేరు.
కనుమ రోజున కాకి కూడా ప్రయాణం చేయదు అని సామెత. కాబట్టి ఈ రోజు ప్రయాణం నిషిద్ధం. మాంసాహారులు ఈ రోజు మాంసాన్ని వండుకుంటారు సాధారణంగా పందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం కనుమ పండుగలో కనపడుతుంది.```
*వరికంకుల సౌందర్యం*```
పక్షులు పంట పాడుచేయకుండా ఉండేందుకు పురుగులను తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను చెప్తారు మన రైతన్నలు. అప్పుడే నూర్చిన వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేస్తారు. ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమ నాడు గుడిలో వరికంకుల గుత్తులను కడతారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపు ముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. తమిళులు కనుమను 'మాట్టు పొంగల్' అని పిలుస్తారు. తెలుగువారు పులగం అంటారు. కొత్త బియ్యం కొత్త పెసర పప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. కొత్త బియ్యాన్ని లేగంటి ఆవు పాలలో వండి కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారు చేయటం ఈ పండుగతోనే ప్రారంభిస్తారు. ```
*ఆధ్యాత్మిక కనుమ*```
అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకెత్తి నందగోకులాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించింది కనుమ పండుగ రోజునే అని చెబుతారు. పశుపోషణ, రక్షణ మానవజాతి కర్తవ్యంగా నాటినుంచి కనుమనాడు పశువులను పూజించే ఆచారం వచ్చిందని ఒక గాథ.
సంక్రమణ కాలంలో ప్రధానంగా పితృతర్పణలు నిర్వర్తించాలి. ఇది పెద్దలను సంస్మరించుకునే పండుగగా మనవారు నిర్దేశించారు. మినుముతో చేసిన గారెలను కనుమనాడు పితృదేవతలకు నివేదిస్తారు. గోదావరి ప్రాంతాల్లో ముత్తైదువలు సకల పిండివంటలతో వేడినైవేద్యం వండి గ్రామదేవతలకు సమర్పణగా రజకులకు అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి ఆడపడుచులు అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి అన్నల చేతుల్లో ఉంచి మంచి జరగాలని కోరుకుంటారు.```
*ముక్కనుమ*```
సంక్రాంతి నాలుగోరోజు ముక్కనుమ అంటారు. కానీ ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు కానీ, కొంత మంది కనుమ నాడు కాక ఈ రోజే మాంసాహారాన్ని తినటానికి కేటాయిస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడవారు సావిత్రి గౌరీ వ్రతాన్ని మొదలు పెడతారు. పదహారు రోజుల పాటు చేసే ఈ వ్రతాన్ని గ్రామంలో ఉన్న ఆడవారందరూ కలిసి చేసుకుంటారు. మట్టితో చేసిన గౌరీ దేవి బొమ్మని కుమ్మరి ఇంటినుంచి మేళతాళాలతో తెస్తారు. కుమ్మరికి స్వయం పాకం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. అన్ని వృత్తుల గౌరవించటం సంక్రాంతి సంప్రదాయాల పరమార్ధం.✍️```-సేకరణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻