#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 #🟨నారా చంద్రబాబు నాయుడు #🏛️రాజకీయాలు
*రేవంత్రెడ్డితో అట్లుంటది బాబు❗*
JANUARY 5, 2026🎯
సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు సాగకుండా అడ్డుకున్నది తానే అని అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అనడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. ఇంత వరకూ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో వుండగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి జలవివాదంపై చర్చలో భాగంగా సంచలన కామెంట్స్ చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేంది తానే అని, అక్కడ పనులు జరగడం లేదని, కావాలంటే నిజనిర్ధారణ కమిటీ అఖిలపక్ష కమిటీని కూడా పంపుదామని ఆయన ప్రకటించారు. తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. ఈ కామెంట్స్తో ఏపీలో సీఎం చంద్రబాబు విలన్ కావాల్సిన పరిస్థితి. ఇష్టుడైన రేవంత్రెడ్డి కామెంట్స్ను ఖండించే తీరిక చంద్రబాబుకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని సీఎం చంద్రబాబు మొదలుకుని, ఆ పార్టీ నాయకులు తక్కువ అంచనా వేడయం వల్లే నేడు ఈ దుస్థితి. తెలంగాణ రాష్ట్ర, అలాగే రాజకీయంగా తన ప్రయోజనాల కోసం రేవంత్రెడ్డి ఎలాంటి అస్త్రాన్ని అయినా ప్రయోగిస్తారనేందుకు సీఎం చంద్రబాబుపై అసెంబ్లీలో చేసిన కామెంట్సే నిదర్శనం.
రేవంత్రెడ్డిని శిష్యుడిగా చంద్రబాబు, సాంకేతికంగా కాంగ్రెస్ సీఎం అయినా, ఇంకా తమ పార్టీ నాయకుడే అన్నట్టుగా టీడీపీ నేతలు చూస్తున్నారు. అందుకే ఇటీవల తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోడానికి ఫ్యామిలీతో వెళ్లిన రేవంత్రెడ్డికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి వారి దర్శనాన్ని కూడా మంత్రి కేశవ్ దగ్గరుండి చేయించి పంపారు.
ఆ మరుసటి రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెళ్లారు. ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కనిపించకపోవడం గమనార్హం. చంద్రబాబు శిష్యుడనే ముద్రతో రాజకీయంగా రేవంత్రెడ్డి నష్టపోతున్నారు. అయితే టీడీపీ మీడియా ఆయనకు అండదండగా వుండడం లాభించే అంశం.
అలాగని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఊహించినట్టు రేవంత్రెడ్డి నెత్తిన పెట్టుకుని ఊరేగే రకం కాదు. అవసరమైతే తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబును బద్నాం చేయడానికి రేవంత్రెడ్డి ఏ మాత్రం వెనుకాడరని ఇప్పటికైనా అర్థమై వుంటుంది. రేవంత్రెడ్డేమీ చిన్న పిల్లాడు కాదు. చంద్రబాబుతో మైత్రితో లాభనష్టాలను బేరీజు వేసుకోలేనంత అమాయకుడు కాదు.
చంద్రబాబుపై గౌరవాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తూనే, అసెంబ్లీ వేదికగా పెద్ద దెబ్బే కొట్టారు. ఇప్పుడు రేవంత్రెడ్డి పేరు ఎత్తకుండా, టీడీపీ మీడియా రాయలసీమ ఎత్తిపోతల ద్రోహి వైఎస్ జగన్ అంటూ ఆక్రోశిస్తోంది. ఇలాంటి రాతలతో జనంలో పలుచన కావడం తప్ప, ఉపయోగం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కాపాడుకోవాలన్న ఆత్రుతలో జగన్నే టార్గెట్ చేయడం నవ్వు తెప్పిస్తోంది.
ఇప్పుడు తేలాల్సింది……… రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇద్దరు సీఎంలు ఏకాంతంగా ఏం మాట్లాడారనేది. ఆ పథకాన్ని ఆపాలని కోరడం, తనపై గౌరవంతో ఆ పని చంద్రబాబు చేశారని రేవంత్రెడ్డి వైపు నుంచి స్పష్టత ఇచ్చారు. ఔనా, కాదా? అనేది చంద్రబాబు నోరు తెరిచి చెప్పాలి. రెండు రోజులు గడుస్తున్నా, చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రేవంత్రెడ్డి చెప్పిందే నిజమని నమ్ముతున్నారు. గురుదక్షిణ రేవంత్రెడ్డి ఆ రకంగా సమర్పించుకున్నారన్న మాట!