#కార్తీకమాసం విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #కార్తీక మాసం
*శంకరునివంటి దైవము.. కార్తికము వంటి మాసము.. మరొకటి లేదు.*
*అక్టోబర్ 22 నుండి కార్తీక మాసం ప్రారంభం...*
నాలుగు వేదాలలో ప్రముఖంగా కీర్తించబడిన దైవం అగ్నిభగవానుడు. ఈయనను స్తుతిస్తూ వేదాలలో అనేక మంత్రాలు దర్శనమిస్తాయి. "అగ్నిముఖావై దేవాః" అని యజుర్వేదం వర్ణిస్తుంటే... ఋగ్వేదం కూడా "అగ్నిమీళ్ల పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. దేవతలందరికీ అగ్ని ముఖం వంటివాడు. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంతం. యజ్ఞయాగాదులలో సమర్పించే హవిర్భాగాలను అగ్నిభగవానుడే అయా దేవతలకి సమర్పిస్తుంటాడు. అందుకే దేవతలందరిలోకి అగ్నిదేవుడు ముఖ్యుడు. " కృత్తికా నక్షత్రమగ్నిదేవతా" అంటూ అగ్ని అధిపతిగా కలిగిన నక్షత్రం కృత్తిక అని యజుర్వేదం స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు కృత్తికా నక్షత్రంతోనే సంవత్సరం ఆరంభమయ్యేది. చంద్రుడు పూర్ణిమనాడు ఏ నక్షత్రంలో ఉంటాడో. ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమినాడు సంచరించడం చేత ఈ మాసానికి కార్తిక మాసమని పేరు.
*న కార్తికసమో మాసో*
*న కృతేన సమం యుగమ్ |*
*న వేదసదృశం శాస్త్రం*
*న తీర్థం గంగయా సమమ్ ॥*
కార్తీక మాసమునకు సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము, వేదాలకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదములైన నదులు లేవన్నది స్కాందపురాణం.
“శివ.. శివ" అంటే చాలు. నేనున్నానంటూ పలికే దైవం శంకరుడు. 'శివ' అంటే శుభం. సర్వకార్యజయం, సర్వపాపహరం. పండితుడు నుంచి పామరుడి వరకు, మహారాజు నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు.... కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు ఆయన.
శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఈశ్వరారాధనకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన కార్తికమాసం వచ్చిందంటే చాలు! నెల రోజులు పండుగదినాలే! ఆలయాలలో రుద్రాభిషేకాలు చేస్తూ చదివే నమక-చమకాలతో పరిసరాలు మారుమ్రోగుతాయి. మంత్రాలు, పూజలు తెలియకపోయినా కార్తికమాసంలో "ఓం నమశ్శివాయ" అంటూ ఓ మారేడు దళాన్ని భక్తితో పరమేశునికి సమర్పిస్తే ఆ అశుతోషుడు తప్పక అనుగ్రహిస్తాడని ఎంతో మంది భక్తుల ఉదంతాలు మనకు ఋజువు చేస్తున్నాయి.
కార్తికమాసంలో సూర్యోదయానికి ముందే చేసే నదీస్నానం అత్యంత శ్రేష్టమైంది. దీనిద్వారా ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. ఈ కాలములో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. సముద్రాలలో సంగమించే పవిత్ర నదీజలాలని ఈ ఋతువులో 'హంసోదకం' అని అంటారు. పైత్య ప్రకోపాలను తగ్గిస్తుందీ హంసోదక స్నానం. నదీ స్నానానికి అవకాశము లభించకపోతే కాలువలు, చెరువులు, నూతుల వద్ద చన్నీటి స్నానం చేయాలి. రక్తనాళాలను స్పందించేలా చేసే చన్నీటి స్నానం శరీరానికి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ స్పందనతో గుండెకు రక్తసరఫరా చేసే నాళాల్లో పేరుకుపోయే కొవ్వు నిల్వల శాతం తగ్గుముఖం పడుతుందంటున్నారు వైద్య నిపుణులు, మానసికంగానూ చాలా రకాల ప్రయోజనాలున్నాయి. చన్నీటి స్నానం అలవాటున్నవారు అనారోగ్యాలకి దూరంగా ఉన్నట్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలను ధరించి దీపారాధన చేసి, అనంతరం శివుణ్ణి యథాశక్తిగా అర్చించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. కార్తికంలో సూర్యోదయానికి ముందు శివసాన్నిధ్యంలో గానం చేసినా, వివిధ వాయిద్యాలను వాయించినా, నృత్యసేవ చేసినా, పూజా ద్రవ్యాలను సమర్పించినా విశేషఫలితమని చెబుతారు.
_కార్తిక దీపం తొలగును పాపం_
దీపం చీకట్లను దూరం చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానంలో ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. శక్తిననుసరించి ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదం. దీపాలసంఖ్యను బట్టి ఫలితాలూ భిన్నంగా ఉంటాయని దీపదాన మాహాత్మ్యంలో చెప్పబడింది. కార్తిక దీపారాధన దేవాలయాలలో, మఠాలలో, పూజామందిరంలో, గృహప్రాంగణాలలో, తులసీ బృందావసంలో, ఉసిరి, మారేడు, రావి వంటి దేవతావృక్షాల దగ్గర, పుణ్య నదీతీరాలలో వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు. వర్ణించి చెబుతున్నాయి. ప్రత్యేకించి ఆలయాల్లో ఎత్తైన దీప స్తంభాలను ఏర్పాటు చేసి, దానిలో నిరంతరాయంగా దీపాలను వెలిగించిన వారికి విశేషభాగ్యాలు కలుగుతాయి.
కార్తికమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తికమాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ విధంగా కార్తికమాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలవంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
_ప్రదోషం.. విశేషం.._
రోజు మొత్తంలో దీపారాధనకు మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలంలో, "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. అటువంటి ప్రదోష సమయంలో కార్తిక దీపారాధన వేవేల ఫలితాలను ప్రసాదిస్తుంది.
ఒకనాడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులందరికీ సూతమహాముని ఎన్నో చరిత్రలు, మహిమలను వినిపించే క్రమంలో కార్తికమాస మాహాత్మ్యం గురించి వివరిస్తూ “ఓ ముని పుంగవులారా! క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించే మానవులకు నెలరోజులపాటు ఆచరించే "ఈ కార్తికమాస వ్రతము" ఉత్తమమైంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు తొలగి కైలాసాన్ని చేరతారు. ఈ కార్తికమాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతమైన ఫలితాలు లభిస్తాయని" చెప్పారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ రుద్రాభిషేకాలు, దీపారాధనలు చేసినాచాలు, వారికి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. కార్తిక మాసానికి ప్రారంభదినమైన శుద్ధపాడ్యమి నుంచి వ్రతారంభం చేయాలి. అలా ప్రారంభించే సమయంలో “ఓ శంకరా! నీకు అనేక నమస్కారాలు. నాచే ఆరంభింపబడే కార్తిక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయి" అని సంకల్పించాలి.
ఈ మాసంలోని వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సంస్కృతంలో దీనిని ఇందువారం అని కూడా అంటారు. సోమవారానికి చంద్రుడు అధిపతి. "చంద్రమా మనసో జాతః" అని వేదం చెబుతోంది. చంద్రుడు మన మనస్సుపై ప్రభావాన్ని చూపుతాడు. మనఃకారకుడైన చంద్రుడి ఆధిపత్యం కలిగిన సోమవారం నాడు చంద్రశేఖరుని ఆరాధన మనోమాలిన్యాలను తొలగిస్తుంది. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. అందుకే శివభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*