#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు #P P P
*బాబూ.. మాట్లాడకపోతేనే మంచిది❗*
OCTOBER 12, 2025🩺
ప్రజలకు వైద్యం, అలాగే పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించే బాధ్యతల నుంచి తప్పుకోడానికి చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల్లో పదింటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. దీనిపై పౌర సమాజంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయకుండా, ముందుకే వెళుతోంది.
ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నిస్తున్న వారి నోళ్లు మూయించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు దబాయింపునకు దిగారు. అయితే పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని అభివృద్ధి చేస్తే కలిగే నష్టాలపై ప్రజలకు స్పష్టత వుంది. చంద్రబాబు తన వాళ్లకు ప్రయోజనం కలిగించే క్రమంలో ప్రజల హక్కుల్ని బలిపెడుతున్నారనే ఆవేదన వుంది. ఇదే సందర్భంలో చంద్రబాబు దబాయింపు ధోరణిని ప్రజలు తప్పు పడుతున్నారు.
తాజాగా మరోసారి చంద్రబాబు పీపీపీ విధానంలో వైద్య కళాశాల్ని అభివృద్ధి చేయడాన్ని తప్పు పట్టే వారిపై విరుచుకుపడ్డారు. గత పాలకులు అనుసరించిన విధానంతో మెడికల్ కాలేజీల కట్టడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు పేదలు ఇబ్బందులు పడాలా? అని ప్రశ్నించారు. తాము చేపట్టిన విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు.
ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు చొప్పు, 17 మెడికల్ కాలేజీలకు రూ.8,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికి ఏడు కాలేజీలను జగన్ హయాంలో నిర్మాణం చేశారు. ఐదింటిలో అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. పది కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పిల్లలకు ఉచిత వైద్యాన్ని అందించొచ్చు. ఈ మొత్తాన్ని ఖర్చు చేయడానికి చంద్రబాబు సర్కార్కు మనసు రావడం లేదు.
ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే, మరి లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా చేపట్టారనే ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాల్సి వుంటుంది. రాజధాని అమరావతిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయలేదు కదా. ప్రభుత్వం వద్ద వైద్య కళాశాలలకు రూ.5 వేలు కోట్లు లేదంటూనే, రాజధానికి మాత్రం ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి లక్ష కోట్లతో రెండేళ్లలో పూర్తి చేయాలనే తపనను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రజలకేమీ తెలియదని, తమకు గిట్టని వాటిపై దబాయింపుతో నోళ్లు మూయించాలని అనుకోవడం అవివేకం. ఇలాంటి వాటిపై ఎంత తక్కువ మాట్లాడితే పాలకులకు అంత మంచిది. లేదంటే, లక్షలాది కోట్లు అప్పులు తెచ్చి, అమరావతిని నిర్మిస్తుండడాన్ని పౌర సమాజం ప్రశ్నిస్తూనే వుంటుంది.