#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు
*బాబు పాలన అత్యంత ప్రమాదకరం..‼️*
NOVEMBER 16, 2025🎯
సమాజంలో అసహనం, అశాంతి ఉండకూడదు. ఇవి రెండు సమాజంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. తద్వారా ప్రజలకు మనశ్శాంతి కరువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి 17 నెలల పాలనలో ఏవైనా తీసుకొచ్చిందంటే అసహనం, అశాంతి అని చెప్పాల్సి వుంటుంది. ఇంత తక్కువ సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గొప్పలు చెప్పుకోవచ్చు.
కానీ తమ పాలనారీతులు సమాజంలో కక్షలు, కార్పణ్యాలు పెంచేవిగా ఉన్నాయనే సంగతిని పాలకులు విస్మరించారు. కేవలం అధికారం చేతిలో వుందన్న ఏకైక కారణంతో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే లెక్కలేని తనంతో ప్రత్యర్థులు, అలాగే సామాన్య ప్రజలపై వేధింపుల పర్వాన్ని సాగిస్తున్నారనే అభిప్రాయం వుంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డగోలుగా నడుచుకుంటున్నారనే విమర్శ వుంది.
ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజానీకం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది. వైసీపీ పాలనే నయం అని ప్రజలు అనుకునే పరిస్థితిని 17 నెలలకే తీసుకొచ్చిన ఘనత కూటమి పాలనకే దక్కింది. నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్పై సొంతవాళ్లలోనే అనేక అనుమానాలు తలెత్తాయి. గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు తప్పులు చేయరని అంతా అనుకున్నారు.
మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న చెడ్డపేరు వుంది. పరిపాలనలో, అలాగే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు వైసీపీ పాలనలో చోటు చేసుకున్న తప్పుల్ని చేయరని జనం ఎంతో నమ్మకంగా వున్నారు. కానీ ఆచరణకు వచ్చే సరికి, జగన్ పాలన ఎన్నో రెట్లు నయమని సానుకూలంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నారా లోకేశ్ రెడ్బుక్ అంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు శ్రీకారం చుట్టారు. తామేం తక్కువని కిందిస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవరికి వారు లోకేశ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏకంగా సామాన్య ప్రజానీకంపై గద్దల్లా పడ్డారు. ఎవరైనా తిరగబడితే పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా, అడ్డగోలుగా వాడుకుంటూ, తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనం, అశాంతిని రేకెత్తించాయి, రేకెత్తిస్తున్నాయి.
చాలా మంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు. రాజకీయంగా టీడీపీకి ఇది మంచిది కాదు. అలాగే ఇలాంటి ధోరణులు ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధికి అవరోధం. మనుషుల మధ్య ప్రేమాభిమానాలుండాలి. భిన్నాభిప్రాయాలు గొడవలకు దారి తీయకూడదు. అసలిప్పుడు ప్రజాస్వామిక లక్షణాలే లేకపోతే, ఇక స్వేచ్ఛగా అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం ఎక్కడ? అని ప్రశ్నించే పరిస్థితి.
కేవలం భయంతో కూటమి పాలనలోని తప్పుల్ని ప్రశ్నించలేకపోతున్నారు. అంతే తప్ప, మౌనం ప్రజామోదం అనుకోకూడదు. రాజకీయంగా వైసీపీని వేధించడం వరకే ముఖ్యంగా టీడీపీ పరిమితం కాలేదు. తటస్థులు, సామాన్యుల ఆస్తులపై కూడా పడుతుండడం వల్లే ఇబ్బందులు తలెత్తాయి. ఒకవేళ అధికారం మారితే, అసహనం, అశాంతి తీవ్ర ఆగ్రహం రూపం దాల్చితే... పరిస్థితి ఏంటో మంత్రి నారా లోకేశ్ ఆలోచించుకుంటే మంచిది. ఏది ఏమైనా తమ పాలనలో నాణేనికి రెండో వైపు ఏం జరుగుతున్నదో చంద్రబాబు, లోకేశ్ తెలుసుకోవడం మంచిది.