Satya Vadapalli
910 views • 1 months ago
శ్రీమదాంధ్ర భాగవతం దశమ స్కంధం - 18
*కాళీయ మర్దనము*
ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. వారు కాళిందిలో ఉన్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణాదృష్టితో చూసాడు. ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్ళు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి?’ అని వాళ్ళని అడిగాడు.
దానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేకమంది భార్యలు ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయిందని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి ఇది కారణం. నేను ఏమి చేస్తానో చూడండి’ అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదవరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. రెండు పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు. అక్కడ ఒక కడిమిచెట్టు ఉన్నది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమయి పోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణపరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహము దూకినట్లు దూకాడు. ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మడుగును చూసేసరికే అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికీ ఉన్నది?” అని సాక్షాత్తు కాళీయుడు చూసాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్నికృష్ణుడిని చూసాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లాడికి. నేను ఉన్న మడుగులోకి దూకుతాడా?’ అనుకుని పడగలు విప్పి కాటువేసాడు. కృష్ణపరమాత్మ స్పృహ తప్పాడు. కాళీయుడు తన దీర్ఘమయిన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపాల బాలురు భయంతో పరుగుపరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు.
ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడడం లేదు. కాళీయ మడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాముచేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు. నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తరువాత అయ్యో ఏమి చేస్తాము అని వెనక్కి వెడతామని అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉండము మేమూ కాళింది మడుగులో దూకేస్తాము. ఆ పాము విషంతో చచ్చిపోతాము’ అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాలబాలురు కూడా అదేప్రయత్నంలో ఉన్నారు.
పరమాత్మ దీనిని చూసాడు. తనను గురించి ఆర్తి చెందేవారున్నారు. ‘నేను వీళ్ళకి దక్కాలి’ అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరమును వెడల్పుగా, పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్నశరీరం పెరిగిపోతే కాళీయుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కిందపడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు.
కాళియుని తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన కాళీయుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు, గోపకాంతలు అందరూ యమున ఒడ్డున సంతోషంతో ‘శభాష్ కృష్ణా’ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలల పగిలిపోయి, లోపల ఉన్న మణులు చెల్లాచదరయి పోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతున్నది. అప్పటివరకు విషముతో నల్లగా వున్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళీయుడు శోషించిపోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది.
కాళీయునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటిమీద ఉన్న ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరయి పోతుండగా, కొప్పు ముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటిమీద బట్ట సరిగా ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా పరుగుపరుగున అక్కడకు వచ్చి చంటిపిల్లలను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళీయుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో! ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో! ఎటువంటి గొప్పగొప్ప పనులు చేశాడో! మహాత్ములయిన వారికి కూడా దర్శనం అవని నీ పాదపద్మములు ఈవేళ మా భర్త తలలమీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళిచేత అలంకృతమయ్యాయి. మా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహమును ఇచ్చావు. ఈవేళ లక్ష్మీదేవికంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగమును మా భర్త పొందాడు. గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది’.
‘ఈశ్వరా! మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని, మమ్మల్ని ఇతనికిచ్చి పెండ్లిచేశారు. మా అయిదవతనం, మా పసుపుకుంకుమలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. అవి ఉండవని నీవు తేల్చేస్తున్నావు. నీవు అనాధనాథుడవు. మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామీ ! మాకు పతిభిక్ష పెట్టవలసినది’ అని అడిగారు.
కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ‘ఈశ్వరా! తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడినుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను’ అన్నాడు.
కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ –
ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీవంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళు విషం అవుతాయి. నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపమునకు వెడితే గరుడుడు నిన్ను చంపేస్తాడని నీ భయం నాకు తెలుసు. నీకా భయం లేకుండా ఇవ్వాళనుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదములు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరమదు. గరుడుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. రమణక ద్వీపమునకు వెళ్ళిపో’ అనగానే కాళియుడు కృష్ణునకు నమస్కారం చేసి తేనే మొదలగు మధుర పదార్థములు, మంచిమంచి హారములు, పట్టు బట్టలు తెచ్చి కృష్ణ భగవానునికి బహూకరించి తన స్నేహితులతో బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు.
ఈ కాళియ మర్దనమును ఉభయ సంధ్యలందు వింటున్న వారికి ఇన్నాళ్ళనుండి కాళీయుడిలా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు వాళ్ళని పాములు కరవవని కృష్ణ భగవానుడి వరం.
ఇందులోని తత్త్వమును గ్రహించాలి. కాళీయుడంటే ఎవరో కాదు మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హృదయక్షేత్రమునుండి నూటఒక్క నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుధ్ధితో వాడుకున్నట్లయితే అందరియందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉన్నది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. ‘రమణ’ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో దానికి రమణకము అని పేరు. ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము. కాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ పాములకు గ్రద్దలంటే భయం. ప్రతిరోజూ కూడా కొంతమంది తేనె, చలిమిడి, చిమ్మిలి పట్టుకువెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమమును ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజున కాళీయుని వంతు వచ్చింది. వానిని కూడా కొద్ది తేనె చిమ్మిలి చలిమిడి పెట్టమని అడిగారు. ‘ఎవరికి పెట్టాలి?’ అని అడిగాడు కాళీయుడు. గరుడుడు వస్తాడు అతనికి బలి ఆహారమును పెట్టాలి అన్నారు. కాళీయుడు ‘గరుత్మంతు డెవరు? నేను పెట్టను. నేను బలవంతుడిని’ అన్నాడు. అయితే నీఖర్మ అని కాళీయుడిని వదిలేశారు.
గరుత్మంతుడు వచ్చి ‘నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు? అని అడిగాడు. మిగిలిన పాములు కాళియుడు పెట్టలేదని చెప్పాయి. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళేలోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. తన నూరు పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళీయుడిని వెంటపడి తరిమి తన రెక్కలతో కొట్టాడు. కొడితే కాళియుడి ఒళ్ళంతా బద్దలయిపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనుక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళియుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. అతను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు.
అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. ‘సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు. నీవు ఎప్పుడయినా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు’ అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాళీయుడు కాళింది సరస్సును చేరాడు.
ఈశ్వరుడు ముందు రమణకమును అనగా మనుష్య శరీరమును ఇస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు. కాళ్ళతో దేవాలయమునకు వెళ్ళవచ్చు. చెవులతో భాగవతమును వినవచ్చు. నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. మనిషి సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ, దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టకుండా తత్సంబంధమయిన క్రియలు చేయడం మానివేస్తాడు. ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనయినా పూజగదిలో పెట్టి రోజూ ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చేయడు. చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. ప్రమాదం వస్తుంది. ఎవరెవరు దేవతారాధనకు ఇష్టపడరో అటువంటి చోటికి వెళతాడు. ఇక్కడ కాళీయుడు కాళింది మడుగుకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషముగా తయారుచేస్తున్నాడు. తనలో ఉన్న నూరు జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. భయంకరమయిన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు యీ విషమును వెనక్కి తీయడు. ఆ అహంకారము పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు క్షమించడు. గోపాల బాలురు, ఆవులు, దూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. నూరు పడగలు పగిలి పోయేటట్లు తొక్కేశాడు. కాళీయుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇపుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయింది. విషమును బయటకు తీసి మరల వదిలిపెట్టాడు.
కాళీయమర్దనము వింటే నూట ఒక్క నాడులలో ఉన్న విషం వెనక్కు వెళ్ళి సద్బుద్ధితో అందరు హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాళియ మర్దనమునకు బాహ్య ప్రయోజనము ఏమిటి? అంటే పాము కరవదు. అంతర ప్రయోజనము లోపలిపాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయదు. మరల రమణక ద్వీపం చేస్తుంది. కాళియమర్దనం వినగానే ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళీయమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమయిన స్థితి ఉన్నది.
#🌅శుభోదయం #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #🙏🏻భక్తి సమాచారం😲 #భాగవతం🙏
13 likes
19 shares