#తెలుసుకుందాం #🥗బలం & పోషక ఆహరం #🥗tasty వంటకాలు #tasty and easy recipes 🤩 #tasty food recipes 😋
దాదాపు అందరి ఇళ్లల్లో సులువుగా పెంచుకునే మొక్కల్లో బచ్చలి కూడా ఒకటి. బచ్చలి తీగ పాకుతువుంటే ఇంట్లో లక్ష్మి కూడా ఆలా పెరుగుతూ ఉంటుంది అని అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అని చెబుతారు. కాల్షియం, ఐరన్, పాస్పరస్, పోటాషిమ్, ఫోలేట్, తో పాటు విటమిన్ A, C, K, B6, రిబోఫ్లోవిన్ కలిగి ఉంటుంది.
దీనికి చలువ చేసే గుణం ఉంటుంది. రక్త పుష్టి ఏర్పడి, రక్త హీనతను తగ్గిస్తుంది. ఫోలేట్ ఉండటం వలన స్త్రీలకు ముఖ్యంగా ప్రగ్నెట్ లేడీ కి ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో
తీగ బచ్చలి,
దుంప బచ్చలి /సెలోన్ బచ్చలి /ఫారిన్ బచ్చలి
తీగ బచ్చలిలో పెద్ద ఆకులు కలది
ఎర్ర బచ్చలి
మొద్దు బచ్చలి
అన్ని 5రకాలుగా చూస్తుంటాం. ఎర్ర బచ్చలి తీగ ఇంటికి ఎంతో అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. సిలోన్ బచ్చలి రుచిలో ఎంతో బాగుంటుంది. ఇలా ప్రతి బచ్చలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కలిగి ఉంటుంది
ఎన్నో ఉపయోగాలను కలిగి ఉండి అతి సులభం గా పెరిగే బచ్చలిని అందరం పెంచుకొని వాడుకునే ప్రయత్నం చేద్దాం.
రెసిపీస్:-
1)పప్పు:-
కుక్కర్ లో పప్పుతో పాటే బచ్చలికూర వేసి ఉడికించి, పులుపుకు చింతకాయ రసం వేసి ఉప్పు, కారం వేసి ఉడికించుకొని ఇంగువ పోపు పెట్టుకోవాలి. చింతకాయ బదులు చింతపండు, నిమ్మరసం వాడుకోవచ్చు.
2)పచ్చడి:-
మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, జిలకర, వేయించి మిక్సీ చేసుకోవాలి. అదే మూకుడులో కాడలతో పాటు తరిగిన బచ్చలి ఆకువేసి మగ్గించుకొని ఉప్పు, పసుపు, చింతపండు వేసి మొత్తం మిక్సీ చేసి ఇంగువ పోపు పెట్టుకోవాలి.
3)సూప్:-
కొద్దిగా నెయ్యి లేదా వెన్న లో బచ్చలి ఆకులు, రెండు మిరియాలు వేసి మగ్గించి నీళ్లు పోసి మిక్సీ చేసి ఉప్పు వేసి తీసుకోవాలి.
4)తీగ బచ్చలిగింజలు తో:-
పచ్చి గింజల కంకులు నూనెలో వేయించి తీసి ఉప్పు, కారం, అంచూర్ పొడి, వేసి కలుపుకొని తినొచ్చు.
లేదా పోపులో టమాటా తో పాటు మొగ్గలు /గింజలు వేసి మగ్గాక ఉప్పు, కారం, నువ్వులపోడి,కొబ్బరిపొడి,వేసి వేగాక కొత్తిమీర వేసి తీసుకోవాలి.
బచ్చలి గింజల కంకుల్ని పుల్లటి చల్ల లో ఉప్పు వేసి ఒకరోజు ఉంచి ఎండలో ఎండనిచ్చి నిలువచేసుకొని చల్ల మిరపకాయ ల వలె అవసరం ఉన్నప్పుడు నూనెలో గోలించి తీసుకోవాలి.
5)బచ్చలి కాడలతో పులుసు:-
మూకుడులో నూనె వేసి బచ్చలి కాడలు తో సహ మగ్గించి పెట్టుకోవాలి. మూకుడులో పోపు చేసి చింతపండు నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు కొద్దిగా మెంతిపొడి, నువ్వుల పొడి, ధనియా పొడి, ఉడికించిన బచ్చలి వేసి ఉప్పు, కారం వేసి కాసేపు మరగనిచ్చి కొత్తిమీర వేసి తీసుకోవాలి.
:-
6)ఆవ పెట్టి కూర:-
మూకుడులో నూనె వేసి ఎక్కువగానే పోపు గింజలు వేసుకొని వేగాక పచ్చిమిర్చి వేసి వేగాక బచ్చలి ఆకు వేసి కొద్దిగా చింతపండు రసం వేసి మగ్గాక ఉప్పు వేసి కాసేపు వేగనిచ్చి తీసి చాల్లారాక ఆవపొడి వేసి కలిపి పెట్టుకోవాలి.
7)పొడికూర:-
పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, జిలకర నూనె లేకుండా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
మూకుడులో నూనె వేసి పోపు గింజలు , పచ్చిమిర్చి వేసి వేగాక బచ్చలి ఆకు వేసి మగ్గించుకోవాలి. ఆకు మెత్తబడ్డాక ఉప్పు,పసుపు,కారం,తయారుచేసుకున్న పొడి, కొత్తిమీర వేసి కలిపి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి.
8)కంద బచ్చలి:-
పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఉడికించిన బచ్చలి, ఉడికించిన కంద వేసి, కొద్దిగా చింతపండు గుజ్జు వేసి,ఉప్పు వేసి కలిపి కొద్దిగా నువ్వుల పొడి వేసి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి.
నువ్వుల పొడి బదులు చల్లారక ఆవ పొడి వేసికూడా చేసుకోవచ్చు.
9)పెసరపప్పు తో:-
పోపులో పచ్చిమిర్చి, వేసి వేగాక బచ్చలికూర వేసి నానబెట్టిన పెసరపప్పు వేసి ఉప్పు వేసి మగ్గినాకా పచ్చికొబ్బరి తురుము వేసి కాసేపు వేగనిచ్చి తీసుకోవాలి.
10)బచ్చలికూర రైస్:-
మూకుడులో నెయ్యి వేసి బచ్చలికూర, మిరియాలు, జిలకర వేసి మగ్గక, చల్లారక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మూకుడులో నెయ్యి వేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పల్లీలు కరివేపాకు, వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేగాక పేస్ట్ చేసిన బచ్చలి ఆకు వేసి వేయించి అన్నం, ఉప్పు వేసి కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలిపి తీసుకోవాలి.
11)పెరుగు పచ్చడి :-
పెరుగులో ఉప్పు, ఆవాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి నేతిలో వేయించి గ్రైండ్ చేసిన బచ్చలి ఆకు, ఉప్పు వేసి నేతి పోపు పెట్టుకోవాలి.
12)టమాటా, బచ్చలి కూర :-
పాన్ లో ధనియాలు, మిరియాలు, మెంతులు, జిలకర వేయించి పొడి చేసుకోవాలి. అదే మూకుడులో నూనె వేసి పచ్చిమిర్చి, బచ్చలి ఆకు వేసి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో పోపు చేసిపచ్చిమిర్చి,టమాటా వేసి మగ్గినాక తయారు చేసుకున్న పొడి, బచ్చలి ఆకు పేస్ట్ వేసి కాసేపు ఉడకనిచ్చి తీసుకోవాలి.
13)కంద, బచ్చలి పచ్చడి :-
మినప్పప్పు, శెనగపప్పు, ధనియాలు, మెంతులు,జిలకర,పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేసి వేగాక పసుపు, ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నూనెలో వేయించిన బచ్చలి వేసి కలిపి కొద్దిగా చింతపండు నీళ్లు పోసి, ఉడికించిన కంద వేసి కచ్చాపచ్చగా రుబ్బుకొని కమ్మటి ఇంగువ పోపు పెట్టుకోవాలి.