#ఏపీ అప్ డేట్స్..📖 #మన ఉచిత పథకాలు #రెండు కళ్ల సిద్ధాంతం.. 👀
*ఇసుక దోపిడీపై సర్కారు కళ్ల తెరవకుంటే కష్టం❗*
SEPTEMBER 1, 2025🎯
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన ఘనమైన హామీలలో ఉచిత ఇసుక కూడా ఒకటి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో కొత్త ఇసుక విధానం తీసుకువచ్చి అడ్డగోలుగా దోచుకుంటున్నారని పదేపదే ఆరోపణలు గుప్పించడం ద్వారా ప్రజలను ఒక రకమైన భయ వాతావరణంలోకి నెట్టిన కూటమి పార్టీలు తాము ఉచితంగా ఇసుక ఇస్తామంటూ నమ్మబలికాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటూనే రకరకాల నిబంధనలతో కొత్త విధానం తీసుకువచ్చారు. ఇసుక తవ్వకానికి, రవాణాకు అయ్యే ఖర్చులు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఇసుక ఉచితమని ప్రకటించారు. కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలను గమనిస్తే ప్రజలకు ఎక్కడా కూడా ఉచితంగా ఇసుక దక్కడం లేదనేది నిజం.
ఇసుకను కూటమి పార్టీల ఎమ్మెల్యేలు తమ అడ్డగోలు దందాలకు అనువుగా ఎంచుకోవడంతో రీచ్ ల వద్ద ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ములన్నీ ఎమ్మెల్యేల ఖాతాల్లోకి వెళుతున్నట్లుగా స్థానికంగా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఉచిత ఇసుక కాదు కదా వైసీపీ జమానాలో ఉన్న ధరల కంటే ఇప్పుడు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇసుక రూపేణా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ దోపిడీలపర్వంలో ప్రభుత్వం దృష్టి సారించకపోతే అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల గురించి చంద్రబాబు నాయుడు నిరంతరం ఐవిఆర్ఎస్ ద్వారా సర్వేలు చేయించుకుంటూ ప్రజల మనోగతం తెలుసుకుంటూ ఉంటారనేది అందరికీ తెలుసు. సాధారణంగా ప్రజల మొబైల్ నెంబరుకే కాలో చేస్తారు కనుక సంక్షేమ పథకాలు గురించి వారి అభిప్రాయాలు అడిగినప్పుడు భిన్నంగా చెప్పడానికి ఇష్టపడని లబ్ధిదారులు పాజిటివ్ గానే స్పందిస్తుంటారు. ఆ రకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి సేకరించే ప్రజాభిప్రాయాలలో 80-90 శాతం వరకు సంతృప్తి స్థాయి వ్యక్తమవుతుందని ప్రభుత్వం గుర్తించింది.
అదే సమయంలో ఉచిత ఇసుక గురించి అభిప్రాయాలు సేకరిస్తే మాత్రం ఏకంగా 40 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా- తమకు మంచి పేరు తెస్తుందనే ఆలోచనతో ఈ పథకం ప్రవేశపెడితే ఈ రేంజ్ లో అసంతృప్తి ఉండడం వారికే ఆశ్చర్యం కలిగిస్తోంది.
అధికారుల ద్వారా మరింత లోతుగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు స్థానికంగా కూటమి పార్టీల నాయకులు సాగిస్తున్న దందాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి తోడు మార్చిన నిబంధనల ప్రకారం వారానికి ఒక లోడు కంటే ఎక్కువ ఇసుక తీసుకువెళ్లడానికి అవకాశం లేకుండా కట్టడి చేయడం కూడా ప్రజల అసంతృప్తికి కారణం అవుతోంది.
ఎమ్మెల్యేలు సాగిస్తున్న అవినీతి దందాను ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్న నేపథ్యంలో ఇసుక అరాచకాల విషయంలో ప్రభుత్వం మేల్కొనకుండా గుడ్డిగా వ్యవహరిస్తే మొత్తం వారి పరువు బజారు పాలు అయ్యే ప్రమాదం ఉంది.
చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ తమ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే సహించేది లేదని రంకెలు వేస్తుంటారు తప్ప ఆచరణలో ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాలని, ఇసుక విషయంలో దోపిడీకి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.