#రాధాష్టమి🙏 #భాద్రపద మాస విశిష్టత 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #రాధాష్టమి 🙏
*రాధాదేవి*
బృందావనంలో 'భక్తి' విశ్వరూపాన్ని చూడవచ్చు. బృందావనవాసులు కృష్ణుణ్ని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతి గృహంలో పూజా మందిరంలో గాక, నట్టింట్లో ఉంటుంది. బృందావనం రాధాకృష్ణుల విహారభూమి.
ఈ 'రాధ' ఎవరు?- ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు. ప్రజభాగవతం రాధ కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది. 'బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామం అన్ని సందర్భాల్లో అందరి నోటా వినిపిస్తుంది. బండి తోలేవాళ్లు సైతం అడ్డువచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి 'రాధే రాధే' అంటారు. తమ ఇంటిలో దేవుడున్నాడనిగాక, దేవుడి ఇంటిలో తామున్నామని భావించుకుంటారు. భక్తిరసం ప్రతి ఇంటా పొంగుతుంది.
లాక్షణికులు రసాలు తొమ్మిది అని పేర్కొన్నారు. వాటిలో భక్తిని రసంగా ఎవరూ చెప్పలేదు. భాగవతం విన్నవారు భక్తిరసాన్ని ఆస్వాదిస్తారు. పోతనామాత్యుడి భాగవతం చదివినవారెవరైనా భక్తిని రసంగా అంగీకరిస్తారు.
రాధాకృష్ణుల విహారభూమి బృందావనం 'ధామం' దేవతల నివాస భూమిని ధామం అంటారు. బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు పూర్ణావతారమని చెబుతూ, ఆ స్వామి లీలావతారమని, ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహా ప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుని చేరే మార్గం ఏది ? కృష్ణుడే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు- 'రాధను ధ్యానం చేయకుండా ఎవరూ నా కృపను పొందడం జరగదు... ఇది ముమ్మాటికీ నిజం'!
రావల్ గ్రామం బృందావన సమీపంలో ఉంది. కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమినాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలికను చూసి నారదుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ లోకి వచ్చిన తరవాత తాను చూస్తున్నది "గోలోక నాయిక" అని గుర్తించాడు. నారదుడు రాధను స్తుతించి, ఆమె తల్లిదండ్రులను దీవిం చాడు. పుట్టినప్పుడు రాధకు చూపు లేదు. ఆ బిడ్డను చూడాలని బంధుమిత్రులు ప్రతిదినం వెళ్తూ ఉండేవారు. బాలకృష్ణను చంకనవేసుకొని యశోదమ్మ కూడా వెళ్లింది. యశోదమ్మ చిన్ని కన్నయ్య అమ్మ చంకలో ఉండే రాధను చూశాడు. రాధ కన్నులు తెరిచింది. ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తరవాత మొదటగా కృష్ణుణ్ని చూడాలనే కోరిక తీరింది.
రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపు తీగలాగా మెరిసిపోతున్నది. కృష్ణుడు పెరిగి పెద్దవాడై జగన్మోహనుడయ్యాడు. సూర్యదేవాలయంలో ఇరువురూ కలుసుకున్నారు. రాధాకృష్ణుల ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమే సాటి.
రాధాదేవి తులసికి పంచామృతాలతో అభిషేకించి, ప్రదక్షిణ చేసింది. తులసీదేవిని మంత్రంతో జపించేది. తులసి మాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమైంది. 'రాధా! నువ్వు మానవజాతిలో జన్మించిన గోలోకేశ్వరివి. నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కల్యాణం తప్పక జరుగుతుంది. బ్రహ్మదేవుడి పౌరోహిత్యంలో నీకు పెండ్లి జరుగుతుంది!' అని తులసీదేవి రాధా దేవిని దీవించింది. ఆమె చెప్పినట్లుగా బ్రహ్మ దేవుడు వచ్చి వారికి వివాహం జరిపాడు.
తాము గోలోక నాయికా నాయకులు అన్న సంగతిని రాధాకృష్ణులు స్మరించుకున్నారు. వారి బృందం గోవులూ గోపాలురుగా జన్మలెత్తారు. రాధాకృష్ణులు విహరించే ఆ నేల పవిత్రత సంతరించుకుంది. దివ్యానంద రసానంద ప్రదాయిని రాధాదేవిని 'రసేశ్వరి'గా భావిస్తారు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*